సేవకుని లక్షణం!

లూకా 16:13

ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకనిని త్రుణీకరించును. మీరు దేవునిని సిరిని ప్రేమించలేరని చెప్పెను.

లూకా 16 వ అధ్యాయములో యేసు క్రీస్తు, తన శిష్యులతో ఒక గృహనిర్వాహకుడి గురించి చెప్పిన సంధర్భములో ఈ వాక్యము చెప్పారు. ఇది ప్రత్యేకించి సేవకులకు మాత్రమే వర్తిస్తుంది. యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా మరియు ప్రభువుగా స్వీకరించిన ప్రతివాడు  ప్రభువునకు సేవకుడే. ఎందుకంటే మనం ఆయనని ప్రభువుగా అంగీకరిస్తే ఆయనే మనకు ప్రభువు మరియు మనము ఆయన సేవకులము. ఈ వాక్యములో దేవుడు ఒక సేవకునికి ఉండవలసిన లక్షణము గురించి చెబుతున్నాడు. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. మన జీవితములో, ప్రతి క్షణము మనం ఒక యజమానిని మాత్రమే సేవించగలము. ఆ యజమాని ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ యజమాని యేసు క్రీస్తు ప్రభువు అయితే గలతీయులకు 5:22 లో చెప్పిన ఆత్మ ఫలము మన జీవితములో ఫలిస్తుంది. మరి ఈ ఆత్మ ఫలము కాకుండా మరి గలతీయులకు 5:19-21 లో చెప్పినటువంటి శరీర ఫలములు మనలో ఉన్నట్లయితే మనము సాతానును సేవించుచున్నట్లే. మనం సాతానును సేవిస్తుంటే పాపములో జీవిస్తాము. దేవుని చిత్తప్రకారము కాకుండా, శరీరెచ్ఛలతో, లోక సంబంధమైన విషయాలకోసం మన ప్రాణమును సాతానుకు అమ్మివేసి అతనికి సేవకునిగా మారకూడదు. లూకా 15 వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుడు, లోకమును ప్రేమించి, తన తండ్రి ప్రేమను తెలుసుకోనలేక సాతానుకు సేవకునిగా మారిపోయాడు. అతడు మారు మనస్సు పొంది తిరిగి తండ్రియొద్దకు వచ్చిన తరువాత నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను(లూకా 15:24) అని అంటాడు. కాబట్టి మనము దేవుని చిత్తప్రకారం నడుచుకోనట్లయితే, మనము బ్రతికియున్నా చనిపోయినట్లే. ఈ వాక్యములో దేవుడు మీరు దేవునిని సిరిని సేవించలేరని చెప్పెను. కాబట్టి మనము దేవుని సేవించాలంటే సిరిని వదిలేయాలి. ఇక్కడ సిరి అనేది చాలా విధాలుగా ఉంటుంది. మన జీవితములో ఏదైనా సిరి ఉందేమో అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఉంటె అది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. అది ధనం కావచ్చు, లేదా విజ్ఞానం, పేరు, ప్రఖ్యాత, గర్వము, కోపము, ఆశ, కోరికలు, మోహము, కామము ఇలా ఏదైనా కావచ్చు. తప్పిపోయిన కుమారుని సిరి- లోకముపైన ఆశ, యూదా ఇస్కిరియతు సిరి- ధనము మీద ఆశ, నికోదిమాసు సిరి – విజ్ఞానము, పరిసయ్యల సిరి – వారి నీతి. ఆ సిరిని మన జీవితములలో నుండి తీసివేయాలి. 1 రాజులు 18:21 లో ఏలియా జనముతో ” రెండు తలంపులతో ఎన్నాళ్ళు తడబడతారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిననుసరించండి ప్రకటించినట్లు”, మనము ఈ రోజు నిర్ణయించుకోవాలి. ఈ రోజే కాదు ప్రతి దినము మనము దేవుని అనుసరించి ఆయనను సేవించాలో లేక సిరిని ప్రేమించి సాతానును సేవించాలో మన చేతుల్లోనే ఉంది.

యోహాను 12:26

 

ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడించవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. 

దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక!