2 సమూయేలు 16: 5-13
ఈ వాక్యభాగములో మనము ఇద్దరి వ్యక్తిత్వాలు తెలుసుకొనవచ్చు. ఒకటి షిమీ, రెండు దావీదు. షిమీ సౌలు కుటుంబమునకు చెందినవాడు. అందుకే దావీదు రాజుగా ఉండటం అతడికి ఇష్టం లేదు. దావీదు మీద అతడికి కోపము, ఆక్రోశము. దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు అతడిని తిట్టే ధైర్యం షిమీకి లేదు. అందుకే దావీదు బయటకు వచ్చినప్పుడు, రాజుగా లేనప్పుడు షిమీ ఆయన వెంటపడి తిడుతున్నాడు. షిమీ పరిస్థితిని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి వంటివాడు. దావీదు మరల రాజు అయిన తరువాత షిమీ వచ్చి దావీదుని క్షమాపణ అడుగుతాడు(2 సమూయేలు 19:16,18-23). దావీదు కూడా అతడిని క్షమిస్తాడు, కానీ అతడు ఆ క్షమాపణలో, పశ్చాత్తాపములో నడవడని దావీదుకి తెలుసు. షిమీ లో ఉన్న ఇటువంటి గుణం వల్లనే చివరికి సోలోమను అతడిని చంపిస్తాడు. షిమీ లాంటి గుణం మనలో కూడా ఉందా? దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తు ప్రసాదించిన క్రొత్త జీవితములో మనం నడుస్తున్నామా?
ఇక్కడ మనం గుర్తించవలసిన రెండవ విషయం, దావీదు యొక్క దయా హృదయం. షిమీ ఎంత తిట్టినా అతడియందు దయ చూపి క్షమించాడు. యేసు క్రీస్తును ప్రజలు ఎంత తిట్టినా, కొట్టినా వారియందు దయ చూపి వారికోసం సిలువ పై చనిపోయారు. మనము కూడా ఇటువంటి క్షమాగుణం, దయాగుణం కలిగియున్నామా?