విత్తువాడు – విత్తనము

యేసు క్రీస్తు ఉపమానములు: విత్తువాడు – విత్తనము

మత్తయి 13:3-9

3ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగాఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 4వాడు విత్తుచుండగా కొన్ని విత్తన ములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను 5కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 6సూర్యుడు ఉదయించి నప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. 7కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి 8కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. 9చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

చెవులు గలవాడు వినును గాక అని యేసు ప్రభువు ఈ ఉపమానమును ముగించెను. ఇక్కడ యేసు క్రీస్తు మన శారీరక చెవులు గురించి మాట్లాడటం లేదు. ఆయన మాటలు వింటున్న వారందరికీ చెవులు ఉన్నాయి. కానీ ఎవరికైతే ఆత్మీయ చెవులు తెరువబడినవో వారు వినును గాక అని యేసు ప్రభువు అంటున్నారు. ఈ ఉపమానము యొక్క భావమును యేసు క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులకు మత్తయి 13:18-23 లో వివరించారు.

మత్తయి 13:18-23

18విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. 19ఎవడైనను రాజ్య మునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. 20రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు. 21అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును. 22ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. 23మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

ఈ ఉపమానము, దేవుని వాక్యము విను వారి గురించి చెబుతుంది. అనగా, ఈ కాలపు మాటల్లో చెప్పుకోవాలంటే అక్కడ వింటున్న వారందరూ చర్చికి వెళ్లి దేవుని వాక్యము వింటున్నారు. అందులో కొంతమంది వాక్యము వింటున్నారు కానీ దానిని వారి హృదయములోనికి గ్రహించలేకపోతున్నారు. వీరి జీవితాలు కొంచెం కూడా మారవు. మరి కొంతమంది వాక్యము విని, దానిని అంగీకరిస్తారు, కానీ విశ్వాసము అనే పునాది బలంగా లేనందున వారి జీవితాలలో ఏదైనా కొంచెం శ్రమ కలిగినా దేవుని వాక్యమును విడిచిపెడతారు. మరి కొంతమంది దేవుని వాక్యము వింటారు కానీ దాని ప్రకారం జీవించారు. వారి ఆశలు, కోరికలు, ధనమోసము ఇవే వారికి ప్రధానము. ఇక చివరి కేటగిరీ చూస్తే వీరు దేవుని వాక్యము వింటూ, గ్రహిస్తూ, దానిని బట్టి జీవిస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన మాటలు వింటూ వాటి ప్రకారం వారి జీవితములను మార్చుకుంటూ ఉంటారు. యేసు క్రీస్తు చెప్పిన భోధలను తప్పకుండా పాటిస్తారు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించి, తమ వలె తమ పొరుగు వారిని ప్రేమించే వారే యేసు క్రీస్తు ప్రభువు యొక్క నిజమైన శిష్యులు.