మన రొట్టె దేవుని వాక్యము!

మత్తయి 4:4

మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును.

ManushyuduRotte

యేసు క్రీస్తు ప్రభువు బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలభై రోజుల ఉపవాసము తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది ఆయనను శోధించుటకు వచ్చెను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని అపవాది యేసుతో అన్నాడు. అప్పుడు యేసు, పై వాక్యమును “ఇలా వ్రాయబడియున్నది” అని సమాధానం చెప్పారు. ఈ వాక్యము ఎక్కడ వ్రాయబడియున్నదో తెలుసా? పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 8:3 లో వ్రాయబడియున్నది. యేసు క్రీస్తు ప్రభువు ఎందుకు రాళ్ళను రొట్టెలుగా మార్చలేదు? ఆయనకు ఆ శక్తి లేదా? మనకు అలాంటి పరిస్థితి వస్తే, అయ్యో! దేవుని నామమునకు అపకీర్తి వస్తుందేమో అని వెంటనే మార్చేస్తాం. కానీ యేసు క్రీస్తు అలా చేయలేదు. సృష్టి యావత్తును సృష్టించిన ఆయనకు ఈ పని చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ భూమిపై ఆయన పరిచర్య పరలోకములో ఉన్న తండ్రి ఆజ్ఞలను బట్టి జరుగుచున్నది. తండ్రి చెప్పినది నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చానని యేసు క్రీస్తు చాలా సార్లు అన్నారు. ఆయనకు తండ్రి చిత్తమేమిటో తెలుసు. అందుకే ఆయన వాక్యముతోనే అపవాదికి సమాధానము ఇచ్చారు. ఒకవేళ పరలోకమునున్న తండ్రి ఆయనను ఆజ్ఞాపించి ఉంటే యేసు క్రీస్తు వెంటనే చేసేవారు.

ఈ వాక్యములో రొట్టె అంటే మనము రోజూ శరీర శక్తి కొరకు తినే ఆహారం మాత్రమే కాకుండా మన జీవనమునకు అవసరం అయిన ప్రతీది ఇందులోకి వస్తుంది. వీటన్నిటి కంటే కూడా గొప్పది దేవుని వాక్యము. అందుకే వాటన్నింటి వలన కాక మనము దేవుని నుండి వచ్చు ప్రతి వాక్యమును బట్టి జీవించాలి అని యేసు చెబుతున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనకు శక్తినిచ్చే ఆహారం దేవుని వాక్యం మాత్రమే. మన ఆధ్యాత్మిక జీవితములో క్రీస్తును తెలుసుకుంటూ ఎదగాలంటే మనము దేవుడు సెలవిచ్చిన మాటలు వినాలి. వాటిని విని, విధేయత చూపించి మన జీవితాలలో పాటించాలి. అందుకే ప్రభువు ప్రార్థనలో యేసుక్రీస్తు ఇలా ప్రార్థన చేయమన్నారు. “మా అనుదినాహారము మాకు దయచేయుము” (మత్తయి 6:11). నశించిపోయే వాటి గురించి దిగులు పడవద్దు అని యేసు చెప్పారు. ఈ రోజు ఏమి తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఇటువంటి వాటిపై దృష్టి కేంద్రీకరించి మన ఆత్మను పస్తు ఉంచకూడదు. దేవుని నుండి ప్రతి క్షణం మనం ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం, చిట్టా ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడే ఆయన మనకోసం, మన పాప క్షమాపణ కోసం శిలువపై చిందించిన రక్తమునకు, ఆయన అర్పించిన ప్రాణమునకు విలువ. యేసు క్రీస్తు ప్రభువు చూపిన దారిలో మనం నడుచుకుంటూ ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మనము పనిచేయాలి. జీవితములో కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, శ్రమలు ఎదురైనా ఆయన యందు విశ్వాసము సడలకుండా ఆయనను మాత్రమే ఆరాధించాలి. పౌలు చెప్పినట్లు ఆయన నామము నిమిత్తము మనం ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు క్షణమాత్రముగానే ఎంచాలి. ఎందుకంటే ఈ లోకములో మన జీవితము ఒక ప్రయాణము వంటిది. అసలు జీవితము, నిత్యత్వమునందు యేసు క్రీస్తు తో కూడా మహిమ పొంది, ఆయన తోడి వారసులము గా పరలోకమునందు మొదలవుతుంది. అటువంటి నిరీక్షణ మనము కలిగియుండాలి.

ఆయనయందే విశ్వాసము ఉంచి, తాత్కాలికమైన, నశించునట్లు ఇప్పటికే తీర్పు తీర్చబడిన ఆ లోక సంబంధమైన విషయములను విడిచిపెట్టి, పాపమును వదలిపెట్టి, ఆయనను వెదకువారిగా ఉండాలి. యేసు క్రీస్తు రెండవ రాకడలో భూమిపై విశ్వాసము గురించి వెదకుతారు. ఆయన మెచ్చుకునే విశ్వాసులుగా మన జీవితాలు ఉండాలి. ఆయనను వెంబడించగోరినవారు తన్ను తాను ఉపేక్షించుకుని, తన సిలువ యెత్తికొని ఆయనను వెంబడించాలి (మార్కు 8:34).

ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? (మార్కు 8:36).