పవిత్ర హృదయము!

కీర్తనలు 17 : 6-8

నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము.

ఈ కీర్తన ద్వారా దావీదు యెహోవాకు మొర పెట్టుకుంటున్నాడు. 6 వ వచనంలో “దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు” అని దావీదు అన్నాడు. ఇక్కడ దేవుని పై దావీదుకి ఉన్న విశ్వాసం మనకు తెలుస్తుంది. దేవుడు నాకు జవాబు ఇవ్వవచ్చు లేదా జవాబు ఇస్తాడేమో అని దావీదు అనట్లేదు. దేవుని ఉత్తరము గురించి ఆయనకు ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే అయన ప్రార్ధించిన ప్రతి సారి దేవుడు ఉత్తరమిచ్చాడు. కీర్తనలు 17:3(Psalms 17:3) లో చూస్తే రాత్రివేళ దేవుడు దావీదు హృదయమును పరిశీలించి ఎటువంటి దురాలోచనలు కనుగొనలేదు. దావీడుకి ఇటువంటి స్వచ్ఛమైన, పవిత్రమైన హృదయం ఉంది కనుక దేవుడు అతని ప్రార్థనలు వింటున్నాడు మరియు జవాబిస్తున్నాడు. అటువంటి హృదయం మనలో ఉందా? ఎటువంటి దురాలోచనలు లేనటువంటి నిష్కలంకమైన హృదయము, మనస్సు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. దేవుడు హృదయములను పరిశోధించువాడు -యిర్మియా 17:10 (Jeremiah 17:10). ఆయనకు మన హృదయములలో ఏముందో తెలుసు. యేసు క్రీస్తు నతానియేలుని చూచిన వెంటనే అతని యందు ఏ కపటము లేదు అని చెప్పెను-యోహాను 1:47 (John 1:47). మనము ఏ కపటము లేకుండా ఉన్నామా? లేక మన సొంత ఆలోచనలు, మన పనులు, మన ఆశలు, కోరికలు, మోహము లతో నిండి దేవుని నిర్లక్ష్యము చేస్తున్నామా? ఒకవేళ మన క్రుదయము స్వచ్ఛముగా ఉంటే మన దృష్టి దేవుని రాజ్యము పై ఉంటుంది-మత్తయి సువార్త 7:33 (Matthew 7:33). మన హృదయము పవిత్రముగా లేకపోతే ఈరోజే పశ్చాత్తాప్పడి దేవుని క్షమాపణ అడుగుదాం. ఆయన నమ్మదగినవాడు. యేసు క్రీస్తు రక్తము తో మనల్ని పరిశుద్ధపరచి మన హృదయములను ఆయన వాక్యముతో కదిగెదరు. దీనికి మనకు దేవుని కృప చాలా అవసరం. కీర్తనలు 17:8(Psalms 17:8)లో నీ కృపాతిశయములు చూపుము అని దేవుని అడుగుతున్నాడు. మనము కృప చేత రక్షించబడ్డాము-ఎఫెశీయులకు 2:8 (Ephesians 2:8) అని దావీదుకి తెలుసు. అందుకే పౌలు వ్రాసిన ప్రతి పత్రిక ప్రారంభములోను మరియు ముగింపులోను “ప్రభువైన యేసు క్రీస్తువారి కృప మీతో ఉందును గాక” అని అంటాడు. ఎందుకంటే ఆ కృప చేత మనము బలవంతులమౌతాము-2 తిమోతి 2:1 (2 Timothy 2:1).

మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మకు తోడైయుండును గాక. ఆమెన్. – ఫిలేమోనుకు 1:25(Philemon 1:25).