దేవుని చిత్తం తెలుసుకో…!

దేవుని చిత్తములేకుండా కుక్క కూడా పుట్టదు అని నా అభిప్రాయం.అలాంటిది మనిషి మీద దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఎలా ఉండాలి? ఇది నా ప్రశ్న. కొంతమంది మేము దేనికి ఉపయోగకరముగా లేము అని నిరుత్సాహపడుతుంటారు. కొంతమంది వారి జీవితములో ఎదురైన పరిస్థితులు చూసి, సమస్తము కోల్పోయినట్లు భాదపడుతుంటారు. మనం ఎన్ని విధాలుగా ఆలోచించినా దేవునికి మనపైన తన చిత్తం తన ప్రణాళిక ప్రత్యేకముగానే ఉంటుంది. మనం అది తెలుసుకొని దేవునిపై ఆధారపడితే మన జీవితంలో   గొప్ప మార్పులు చూడగలుగుతాము.

English లో ఒక Quotation ఈ విధముగా ఉంది- “Never conclude your capacity on your present situation. Because TIME has the power to change ordinary Coal into a Diamond.”

వాతావరణాన్ని క్షణంలో మారుస్తున్న దేవునికి మన పరిస్థితులు మార్చడానికి ఒక క్షణం చాలు. పెంటకుప్ప మీద ఉన్న వానిని సింహాసనము మీద కూర్చుండపెట్టగలడు, సింహాసనం మీద ఉన్న వానిని నేలను పడద్రోయగలడు. ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా పిలిచే ఆ దేవునినే మనము ఆరాధిస్తున్నాము.

అబ్రహాము: కల్దీయుల దేశస్తుడు, విగ్రహరాధికుల మధ్య నివసించాడు. కాని, దేవుని చిత్తం ఇశ్రాయేలు దేశం   తీసుకొనివచ్చి తనను ఆశీర్వదించి, విశ్వాసులకు తండ్రిని చేయ్యాలి.

యాకోబు : మోసగాడు. కాని,దేవుని చిత్తం తన గర్భం నుండి పండ్రెండు గోత్రాలను తీసుకొనిరావాలి, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాలి.

దావీదు : గొర్రెల కాపరి, తన ఇంట్లో చిన్నవాడు. కాని, దేవుని చిత్తం ఇశ్రాయేలు మీద రాజుగా చేయ్యాలి.

రూతు : దేవదాసి, శపించబడిన దేశంలో ఉన్నది కాని, దేవుని చిత్తం తనను యేసుక్రీస్తు వంశావలిలో చేర్చాలి.

రాహాబు : వేశ్య, శపించబడిన పట్టణంలో ఉన్నది కాని, దేవుని చిత్తం తన సంతానం నుండి లోక రక్షకుడైన యేసుప్రభువు జన్మించాలి.

పేతురు : జాలరి, చదువు రానివాడు, తొందరపాటు స్వభావం కలిగినవాడు కాని, దేవుని చిత్తం తన మీద సంఘమును నిర్మించాలి.

పౌలు : హంతకుడు దూషకుడు కాని, దేవుని చిత్తం అన్యజనులకు అపోస్తలునిగా చేయ్యాలి.

ప్రియ చదువరి! దేవుని కార్యాలు మన హృదయానికి గోచరముకానివి. మనము నమ్మిన దేవుడు ఏమైనచేయగలడు. అడవిలో ఉన్న యోసేపును కోటలోపెట్టాడు, కోటలో ఉన్న మోషేను అడవిలో పెట్టాడు. విశ్వసి తన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూడాలన్నా, ఓటమి అనేది చూడకూడదని అనుకున్నా, ఆ విశ్వాసి మూడు విషయాలు ప్రత్యక్షముగా తెలుసుకోవాలి. 1. నీవు ఏమైయున్నావో తెలుసుకోవాలి 2. దేవుడు ఏమైయున్నాడో తెలుసుకోవాలి 3. దేవునిలో నీవు ఏమైయున్నావో తెలుసుకోవాలి. ఈ మూడు తెలుసుకోవాలంటే మూడు విషయాలు నీలో ఉండాలి. 1. ప్రార్ధన 2. వాక్యం 3.పరిశుద్ధత.

ప్రార్ధన చేయకుండ వాక్యం చదవలేము, వాక్యము చదవకుండ ప్రార్ధన చేయలేము. ఈ రెండు లేకుండా పరిశుద్ధముగా జీవించలేము. పరిశుద్ధత లేకుండ ప్రార్ధన చేయలేము,వాక్యము చదవలేము. ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానమైయున్నవి. ఈ మూడు లేకుండ క్రైస్తవ జీవితానికి పరిపూర్ణత లేదు.

ఆదికాండం 37వ అధ్యాయం నుండి యోసేపు కనిపిస్తాడు. యోసేపు 17 సం||ల వయసులోనే తనను రాజు చేస్తానని దేవుడు బయలుపరిచాడు. ఆ దర్శనం నెరవేరడానికి 13 సం||లు ఎదురు చూసాడు. తన ఈ 13 సం||ల విశ్వాసపు యాత్రలో నెమ్మది సంతోషం అనేది ఎక్కడా లేదు. తనకు ఎదురైన ఏ సంధర్భము తాను రాజు అవుతాడని ఎక్కడా కనిపించలేదు. ఇంతవరకు ఒక బానిస, ఖైది రాజు అయినట్లు ఎక్కడ లేదు. కాని, దేవుని చిత్తం యోసేపును రాజుని చేయ్యాలి.   దేవుని దర్శనం పొందుకున్న యోసేపు, రాజు కావలసిన యోసేపు బాట పూల బాట కాదు ముళ్ళ బాట.

యోసేపు దేవుని దర్శనం పొందిన తరవాత తనకు ఎదురైన పరిస్థితులు గమనిస్తే. తన అన్నలు 20 తులముల వెండికి ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. ఆ ఇష్మాయేలీయులు ఐగుప్తు రాజ సంరక్షక సేనాధిపతికి బానిసగా అమ్మివేశారు. ఫోతిఫర్ భార్య వలన రాజు ఖైధీలను బంధించు చెరసాలలో వేయబడ్డాడు. కాని, దేవుని చిత్తం యేసేపు ఏ దేశములో బానిసగా, ఖైధిగా ఉన్నాడో అదే దేశములో తనను రాజుగా చేయ్యాలి. యోసేపు ఏ సందర్భములోను తన విశ్వాసాన్ని పరిశుద్దతను విడువలేదు. దేవుని దూషించే ఒక్క మాట కూడా పలుక లేదు. యోసేపు రాజు కావడానికి కొన్ని గంటల ముందు యోసేపు పరిస్థితి చూస్తే మనకు ఆశ్చర్యము కలిగిస్తుంది. ఆది 41:14 లో – ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో ముందుకి వచ్చేవరకు యోసేపు క్షౌరము లేక మాసిన బట్టలతో పిచ్చివాడిలా ఆ జైలులో ఉన్నాడు. ఎవరైనా ఊహించగలరా ఆ పరిసస్థితిలో రాజు అవుతాడని. కాని, దేవునికి సమస్తము సాధ్యము.

ప్రియ చదువరి! దేవునికి నీ మీద ఒక ఉద్దేశం ఉంది. అది తెలుసుకుంటే ఎన్ని అవమానాలు వచ్చినా, ఓటమిలు ఎన్ని సారులు వెక్కిరించినా, భయపడము, పాపము చేయము. ప్రపంచములో ఉన్న ప్రతి ఓడకు స్టీరింగ్ ఉంటుంది కాని, నోవహు ఓడకు స్టీరింగ్ ఉండదు. నోవహు ఓడ స్టీరింగ్ దేవుని చేతిలో ఉంది. ఆ ఓడ ఎక్కడికి వెళ్ళాలో దేవుని చిత్తప్రకారముగా వెళ్తుందే కాని, నోవహుకు ఎటువంటి సంబంధము లేదు. మన జీవిత స్టీరింగ్ దేవునికి ఇచ్చినప్పుడే మన జీవితములో గొప్ప అద్భుతాలు చూడగలుగుతాము. నాకు అంతా తెలుసు అని గర్వముతో ముందుకి వెళ్తే ప్రమాదములో పడిపోతాము.

ప్రార్ధన, వాక్యం, పరిశుద్దతతో దేవుడు నీపై కలిగిన చిత్తమును నెరవేర్చుటలో ముందుకు సాగు. గురి యేసయ్య మీద నిలిపి లోకమును చూడక, భయపడక లోకమును జయించిన యేసయ్యను సంతోషపెడుతు గురియొద్దకే పరుగెత్తు.

-Pastor Anil Andrewz