పరిశుద్ద గ్రంధములో అనేక రకములైన ఆరాధనలు కనిపిస్తాయి. కాని, వాటిలో ఏది దేవునికి ఇష్టమైన ఆరాధన అనేది ప్రాముఖ్యం.
1.అనాలోచితంగా (అజ్ఞానముగా) ఆరాధించుట:
అపో.కా. 17:22-31 పౌలు ఏథెన్సులో సంచరిస్తున్నప్పుడు జరిగిన సంఘటన. (23వ) నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద – తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఏథెన్సు వారికి, దేవునికి ఏమి కావాలి, దేవుడెవరు అనేది తెలియకుండా ఆరాధిస్తున్నారు. అనాలోచితముగా దేవుని ఆరాధించుట – కళ్ళకు గంతలు కట్టుకొని గురిని కొట్టుటతో సమానం.
- వ్యర్ధముగా ఆరాధించుట: మత్తయి 15:7-9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు. పరిసయ్యులు లోకపరమైన పద్దతులు, ఆచారాలు కలిగియుండి దేవుని ఆరాధించారు, అది మంచిది కాదు. అలాంటివారిని యేసు ప్రభువు వేషదారులారా అని పిలుస్తున్నాడు.
- నిజమైన ఆరాధన: యోహాను 4:23,24… దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను ఆత్మతో,సత్యముతో ఆరాధించేవారు దేవునికి కావాలి. వాటితో పాటుగా ఆరాధించేవారు పరిశుద్దత కలిగియుండాలి. కీర్తనలు 96:8 లో …నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. లేవి.కా. 2:1-3 లో నైవేద్యములో గోధుమపిండి, నూనె, సాంబ్రాణి ఉన్నవి. గోధుమపిండితో రొట్టెను చేసి కాల్చుతారు. క్రీస్తు కూడా సిలువలో రొట్టెవలె కాల్చబడినాడు. గోధుమపిండి క్రీస్తుకు సాదృశ్యం. నూనె ఆత్మకు సాదృశ్యం. సాంబ్రాణి సువాసన ఇస్తుంది, సాంబ్రాణి పరిశుద్దతకు సాదృశ్యం. ఆరాధనలో ఆత్మ, సత్యముతో పాటు పరిశుద్దత ఉంటేనే దేవునికి ఇంపుగా, మహిమకరముగా, అంగీకారముగా ఉంటుంది. నీ ఆరాధన ఎలా ఉన్నది?